ఉపరాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు
- రైతులు, మహిళల పోరాట గాథకు ప్రతిరూపం..
- ఉపరాష్ట్రపతికి అమరావతి పుస్తకం అందజేత
నరసరావుపేట, ఆంధ్రప్రభ: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన తోటి టీడీపీ ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘అమరావతి: ప్రజలచే నిర్మితం – విధిచే సురక్షితం’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు.
అమరావతి ప్రస్థానాన్ని వివరిస్తూ రూపొందించిన ఈ పుస్తకంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వారసత్వం, రాజధాని కోసం రైతులు, మహిళలు సాగించిన 1,631 రోజుల సుదీర్ఘ పోరాటం, అలాగే 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పునరుద్ధరించే వరకు జరిగిన పరిణామాలను పొందుపరిచినట్లు ఎంపీ తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని సంపద సృష్టి, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
