ADB | అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో
- రాత్రి వాహనాల రాకపోకలకు అనుమతించాలని ఎఫ్డీఓ ఆఫీస్ ముట్టడి
- బాదితులతో మాట్లాడిని ఎమ్మెల్యే బొజ్జు పటేల్
- సమస్యలను పరిష్కరిస్తానని హామీ
జన్నారం, ( ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారంలో బుధవారం అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు అనుమతించాలని పలువురు నేతలు భారీ రాస్తారోకో చేశారు. ఆ తర్వాత స్థానిక ఎఫ్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి, ఉద్యోగులు బయటకు వెళ్లకుండా నేతలు బైఠాయించారు.
జన్నారంకు చెందిన మహమ్మద్ మోబీన్ మంగళవారం రాత్రి జన్నారం నుంచి లక్షేట్టిపేట వెళుతుండగా మండలంలోని తపాల్ పూర్ అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద మంచిర్యాల ఫ్లయింగ్ స్క్యాడ్ రేంజ్ ఆఫీసర్ రమాదేవి, బీట్ అధికారి రవి, ఇతరులు అడ్డుకొని మొబీన్ ను కొట్టారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, రాత్రి వేళల్లో స్థానిక ప్రజల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అతనితోపాటు నేతలు మందపల్లి వీరాచారి, మిక్కిలినేని రాజశేఖర్, ఎం.డి రియాజోద్దీన్, సోహెల్ షా, అజ్మత్ ఖాన్, ఫసిహుల్ల, సాధుపాషా, ఎం.డి అజార్, ఎజాస్, కొండపల్లి మహేష్, నందు నాయక్, రవి తదితరులు బస్టాండ్ ఆవరణలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ అల్లం నరేందర్, జన్నారం, దండేపల్లి ఎస్సైలు గుండేటి రాజవర్ధన్, ఉదయ్ కిరణ్, పోలీసులు చేరుకొని బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తామన్నారు. దీంతో అక్కడి నుండి ర్యాలీగా స్థానిక ఎఫ్డీఓ కార్యాలయం ముట్టడించి, ఉద్యోగులను బయటకు వెళ్లకుండా మెయిన్ డోర్ దగ్గర బైటాయించారు.
దీంతో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, సీఐ నరేందర్ మంచిర్యాల డి.ఎఫ్.ఓ శివ్ ఆశిష్ సింగ్ తో సాయంత్రం చరవాణిలో మాట్లాడారు. బాధితునికి న్యాయం చేస్తానని, రాత్రి వేళల్లో స్థానిక ప్రజల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బాధితులతో పాటు నేతలంతా శాంతించారు.