TG | రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది : మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఆంధ్రప్రభ : భూమికి, విత్తనానికి మధ్య ఎలాంటి బంధం ఉందో.. రైతులతో కాంగ్రెస్ పార్టీకి అలాంటి బంధమే ఉందని, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష రుణమాపీని కూడా ఏకకాలంలో చేయలేదని, తద్వారా రైతులపై రూ.11,145 కోట్ల మేర వడ్డీ భారం పడిందని గుర్తు చేశారు. గతంలో నాట్లు వేసే సమయం కాదు.. కోతల సమయానికి కూడా రైతుబంధు అందించలేదని విమర్శించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.72 వేల కోట్ల (35 శాతం) నిధులు వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించినట్లు తుమ్మల చెప్పారు.
పదేళ్ల పాలనలో రైతులకు ఇబ్బందులు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతులు పడిన ఇబ్బందులు గమనించామని, వారి కన్నీరు తుడవడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల అన్నారు. వరికి బోనస్.. తమ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందన్నారు.
సాగు చేసే రైతులకు నిజమైన భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాలు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
రైతును రాజును చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు.