డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో అవినీతి.

డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో అవినీతి.

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి

పెద్దపల్లి రూరల్ ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లాలో డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు.

పెద్దపల్లిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్‌రెడ్డితో కలిసి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పూర్వపు సీఎంఆర్ బకాయిలను ప్రభుత్వానికి చెల్లించకుండా ఉన్న కొన్ని రైస్ మిల్లులను డిఫాల్ట్ జాబితాలో చేర్చినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించిందని గుర్తు చేశారు. ఒకవైపు మంత్రులు డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం కేటాయించబోమని చెబుతుండగా, మరోవైపు అధికారులు అదే మిల్లులకు ధాన్యం కేటాయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

కొన్ని మిల్లులకు అధిక తూకంతో ధాన్యం సరఫరా చేస్తూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అవినీతి సొమ్ము ఎవరికి చేరిందో ప్రభుత్వం విచారణ ద్వారా వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా యాత్ర తర్వాతే మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించారని అన్నారు. ముందస్తుగా స్పందించి ఉంటే రైతులకు ఇబ్బందులు తప్పేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ఎలాంటి కోతలు విధించకుండా రైతుల ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని కోరారు. రైతుల ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు.

సమావేశంలో నాయకులు ప్రవీణ్, శివంగారి సతీష్, బెజ్జంకి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.