విద్యార్థుల చేరికలో నిజామాబాద్‌కు తొలి స్థానం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి/సిరికొండ (ఆంధ్రప్రభ): ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన వ్యక్తిగత సహాయకుడు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.

ప్రకటన ప్రకారం, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీఐ నివేదికలో తెలంగాణ 59.70 స్కోరుతో దేశంలో 18వ స్థానంలో నిలిచింది. కాగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5,111 మంది విద్యార్థులు కొత్తగా చేరడంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించడంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని ఎమ్మెల్యే వారిని అభినందించినట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, ఆధునిక సాంకేతిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల పెరుగుదల వల్లే విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని ఎమ్మెల్యే వివరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.