బాపట్లలో ఓటర్ల మ్యాపింగ్ 84 శాతం పూర్తి
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ వేగవంతం..
డిజిటలైజేషన్‌కు ప్రత్యేక చర్యలు
బాపట్ల, ఆంధ్రప్రభ: బాపట్ల జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ 84 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
శాశ్వతంగా వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల వివరాలను స్థానికంగా పూర్తిస్థాయిలో నిర్ధారించిన అనంతరమే ఓటర్ల జాబితాలో నమోదు లేదా తొలగింపు ప్రక్రియ చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
తాత్కాలికంగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు తమ పేర్లు జాబితా నుంచి తొలగించకుండా ఉండేందుకు సంబంధిత బూత్ లెవల్ అధికారిని (బీఎల్వో) సంప్రదించాలని సూచించారు. అలాగే ఆన్లైన్లో కూడా ఓటరు వివరాలను ధృవీకరించుకునే సదుపాయం అందుబాటులో ఉందని వెల్లడించారు.
