యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి
రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యాప్ను ఉపసంహరించాలి: సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్
మరిపెడ, ఆంధ్రప్రభ: రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా (ఫర్టిలైజర్) యాప్ను వెంటనే రద్దు చేసి, యూరియాను తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని సీపీఐ(ఎం) మరిపెడ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ డిమాండ్ చేశారు.
శనివారం మరిపెడలోని స్థానిక ప్రజా సంఘాల భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యూరియా యాప్ రైతులకు మరణశాపంగా మారిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే రాయితీలను క్రమంగా తగ్గిస్తూ, ఎరువులు, పురుగుమందుల ధరలను పెంచి వ్యవసాయాన్ని భారంగా మారుస్తున్నాయని విమర్శించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎరువుల బస్తాల ధరలు రూ.450 నుంచి రూ.550 వరకు పెరిగాయని పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ పరికరాలు, పచ్చిరొట్టె విత్తనాలు వంటి పలు సబ్సిడీ పథకాలు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం వాటిని నిలిపివేశారని అన్నారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి అప్పగించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని ఆరోపించిన ఆయన, అదే విధానంలో భాగంగానే యూరియా యాప్ను తీసుకొచ్చారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం రైతులకు స్మార్ట్ఫోన్ వినియోగం, యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం తెలియక తీవ్ర అయోమయం నెలకొందని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు వెంటనే స్పందించి యూరియా యాప్ను రద్దు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను దేశవ్యాప్తంగా రైతులు దీర్ఘకాల పోరాటంతో వెనక్కి తీసుకునేలా చేశారని గుర్తు చేస్తూ, రైతు వ్యతిరేక నిర్ణయాలను కొనసాగిస్తే మరోసారి బలమైన ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
