చిట్యాల–భువనగిరి నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన
రూ.240 కోట్లతో రోడ్డు విస్తరణ.. శంకుస్థాపన సభను విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ పిలుపు
చిట్యాల, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా చిట్యాల నుంచి భువనగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన సభను ప్రజలందరూ విజయవంతం చేయాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ పిలుపునిచ్చారు.
శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రూ.240 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జరగనున్న ఈ రోడ్డు విస్తరణ పనుల పైలాన్ శంకుస్థాపన కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమానికి ముందు ఉదయం 9 గంటలకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రయాణ సౌకర్యాలను పెంపొందించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. ఈ రోడ్డు విస్తరణతో ప్రాంత రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించి శంకుస్థాపన సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఎద్దులపూరి కృష్ణ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
