శరవేగంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ..

అధికారులకు జేసీ ఆదేశాలు

నిర్దేశిత గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పూర్తి చేయాలని సూచన

తిరుపతి, ఆంధ్రప్రభ: జిల్లాలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు అధికారులను ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతి నగరంలోని కోర్లగుంట, పోస్టల్ కాలనీ పరిధిలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ స్టేషన్ల వారీగా జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), సూపర్వైజర్లతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏఎస్‌డీ జాబితా తయారీని వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు సంబంధిత ఆన్‌లైన్ ప్రక్రియను కూడా ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నాణ్యతతో పాటు నిర్దేశిత గడువుల పాటింపు కూడా అత్యంత కీలకమని జాయింట్ కలెక్టర్ సూచించారు.

ఈ తనిఖీల్లో తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్‌బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.