ఓటరు జాబితాల పారదర్శకతకు బూత్ లెవల్ ఏజెంట్లే కీలకం
ఓటరు జాబితాల పారదర్శకతకు బూత్ లెవల్ ఏజెంట్లే కీలకం
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లకు ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ హాజరై బూత్ లెవల్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. ఓటరు జాబితాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల అధికారులు సమగ్రంగా వివరించి, ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
ప్రతి అర్హత కలిగిన పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బూత్ లెవల్ ఏజెంట్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ సహకరించాలని అధికారులు కోరారు.
ఈ అవగాహన సదస్సులో ఎన్నికల శాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.
