ముగిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ‘పల్లె నిద్ర’…

ముగిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ‘పల్లె నిద్ర’…

బట్టిగల్లూరులో తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిన మంత్రి..

సోంపేట, ఆంధ్రప్రభ : సోంపేట మండలం నడుమూరు గ్రామంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వ విప్ డాక్టర్ అశోక్ బాబు తో కలిసి చేపట్టిన ‘పల్లె నిద్ర’ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. గత శుక్రవారం రాత్రి నడుమూరు గ్రామంలో బస చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించారు.

గ్రామంలో రాత్రి బసకు సహకరించిన నడుమూరు గ్రామస్థుల ఆతిథ్యానికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని, ప్రజల మధ్య ఉండేందుకే ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం శనివారం ఉదయం సోంపేట మండలం బట్టిగల్లూరు గ్రామ తీరంలో మంత్రి రామ్మోహన్ నాయుడు తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సంరక్షించిన ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్ర జలాల్లోకి విడిచిపెట్టి, జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.

సముద్ర తీరాన్ని, తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విప్,ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.