అక్రమాలకు చెక్.. అప్రమత్తతకు పిలుపు

దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి తెలిపారు. రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా డీసీపీ ఉగ్గే భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున దండేపల్లి మండలం గూడెం గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

సీఐ రమణమూర్తి నేతృత్వంలో 30 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 40 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, మూడు టిప్పర్లను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా, విక్రయం లేదా వినియోగం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

భూ సంబంధిత వివాదాల్లో పాల్గొని అమాయకులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

గంజాయి, గుడుంబా, ఇతర అక్రమ రవాణా కార్యకలాపాలు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని సీఐ పిలుపునిచ్చారు. ఈ కార్డన్ సెర్చ్‌లో దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్, లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్, జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్‌తో పాటు సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.