ఎల్‌నినో ఎఫెక్ట్‌పై అప్రమత్తం కావాలి..
వరి నాట్లలో తొందరపడొద్దు
ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి
గణపురం, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు పరిస్థితులను అంచనా వేసుకుని వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు.
మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు తగ్గిన నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలు, సాంకేతిక సలహాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని రైతులు గమనించి వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలనే సాగు చేయాలని కోరారు. ముఖ్యంగా గణపురం మండల రైతులు వరి నాట్ల విషయంలో తొందరపడవద్దని, ఘనపసముద్రం చెరువులో తగినంత నీరు లేకపోవడంతో పరిస్థితులను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తూ వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తే అధిక దిగుబడులతో పాటు మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్, సొసైటీ ఛైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్, తహసీల్దార్ అడ్లూరి రాజేశ్వర్ రావు, ఎంపీడీవో భాస్కర్, మండల వ్యవసాయ అధికారి దేశబోయిన ఐలయ్య, నాయకులు తాళ్లపెల్లి భాస్కర్ రావు, చోటే మియా, వడ్లకొండ నారాయణ గౌడ్, బత్తిని శివశంకర్ గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
