ఆగస్టు 13న శ్రావణమాసోత్సవాలు ప్రారంభం..
- సెప్టెంబరు 12వ తేదీన ముగియనున్న శ్రావణమాసోత్సవాలు..
- శ్రావణమాసం సందర్భంగా ఆన్లైన్ టికెట్ల విధానంలో మార్పులు..
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 12 వరకు శ్రావణమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు గురువారం తెలిపారు.
శ్రావణమాసంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివస్తారని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలు, స్పర్శదర్శనం టికెట్లలో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు.
శ్రావణమాసంలోని శుక్ర, శని, ఆదివారాలు, సోమవారాలు కలిపి మొత్తం 19 రోజుల పాటు ఆర్జిత అభిషేకం, ఆర్జిత కుంకుమార్చన సేవలను నిలిపివేస్తామని తెలిపారు. ఈ రద్దీ రోజుల్లో రాత్రి 8.30 గంటల స్లాట్లో మాత్రమే 250 స్పర్శదర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
మిగిలిన రోజుల్లో ఉదయం 7.30 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు, రాత్రి 9 గంటలకు మూడు విడతల్లో స్పర్శదర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో ఆర్జిత అభిషేకం, ఆర్జిత కుంకుమార్చన సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
భక్తుల సౌకర్యార్థం స్పర్శదర్శనం, ఆర్జిత సేవల టికెట్లలో 80 శాతం టికెట్లను మనమిత్ర వాట్సాప్ ద్వారా, మిగిలిన 20 శాతం టికెట్లను దేవస్థానం వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంచామని తెలిపారు. భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని తమ యాత్రను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
