Bhogapuram | నిరంతరాయ విద్యుత్‌ సరఫరాపై మంత్రి ఆదేశాలు

  • ప్రధాని మోదీ పర్యటనపై ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి సమీక్ష
  • భోగాపురం విమానాశ్రయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ఆదేశాలు
  • అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని సూచన
  • పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల అమలు వేగవంతం చేయాలని ఆదేశం
  • గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళిక..
  • ఉద్యోగాల్లో దళారులను నమ్మొద్దని యువతకు విజ్ఞప్తి
  • మంత్రి గొట్టిపాటి రవికుమార్

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : భోగాపురంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు.

గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలోని సీఎండీ కార్యాలయం నుంచి ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అవసరమైన విద్యుత్ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.

కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని క్షేత్రస్థాయిలో నియమించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ , కుసుమ్ పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు సందర్భంగా విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యుత్ శాఖలో ఉద్యోగ నియామకాలపై మంత్రి స్పష్టత ఇచ్చారు. శాఖలో నియామకాలు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన మాత్రమే జరుగుతాయని, ఉద్యోగాల పేరుతో దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలను అందించడంతో పాటు విద్యుత్ శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.