Cyber Loan Fraud | లోన్ పేరుతో మహిళకు సైబర్ వేధింపులు..

Cyber Loan Fraud | బూర్గంపాడు, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని గౌతంపురం కాలనీలో లోన్ ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళను భారీ సైబర్ మోసానికి గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. రుణం ఇప్పిస్తామని చెప్పిన నిందితులు బాధితురాలి నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు సహా వ్యక్తిగత వివరాలను సేకరించారు. అనంతరం ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి, వాట్సాప్ ద్వారా పంపిస్తూ డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.

భయాందోళనకు గురైన బాధితురాలు విడతల వారీగా మొత్తం రూ.6.70 లక్షలు నిందితులకు చెల్లించినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న బూర్గంపాడు పోలీసులు వెంటనే స్పందించి, బాధితురాలు చెల్లించిన మొత్తంలో రూ.3.20 లక్షలను హోల్డ్ చేయించడంలో విజయవంతమయ్యారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

ప్రజలకు పోలీసుల సూచనలు

రుణాల పేరుతో ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించారు. మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులు లేదా ఇతర సైబర్ వేధింపులు ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులను లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలకూ పాల్పడవద్దని పోలీసులు కోరారు.