Tourism |అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్‌

రాజవరం , ఆంధ్రప్రభ: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజవరం (పేరవరం)లోని శ్రీ వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో నిర్వహించిన గురుపౌర్ణమి మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనానికి యోగా, ధ్యానం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరి జీవన విధానంలో యోగా, ధ్యానాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికతను, ధ్యానాన్ని ప్రజలకు చేరువ చేస్తున్న ధ్యాన కేంద్రం నిర్వాహకులను ఆయన అభినందించారు.

కోనసీమలోని ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ “కోనసీమ టూరిజం సర్క్యూట్” అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజవరం పిరమిడ్ ధ్యాన కేంద్రం, గోదావరి తీర అందాలు, వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం, వాటర్ స్పోర్ట్స్ వంటి ప్రాంతాలను కలిపి సమగ్ర పర్యాటక ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో చర్చించి అవసరమైన నిధులు సాధించేందుకు ప్రయత్నిస్తానని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, వెల్‌నెస్, యోగా, ధ్యానం, ప్రకృతి పర్యాటకాన్ని సమన్వయం చేస్తూ కోనసీమను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.