తాడిపూడి ఆయకట్టుకు పట్టిసీమ నీరు మళ్లించాలి..

రైతు సంఘం ధర్నా


ఏలూరు/ఉంగుటూరు, జులై 28 (ఆంధ్రప్రభ): తాడిపూడి ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీరు అందించాలని, ఉంగుటూరు నియోజకవర్గంలోని గొల్లగూడెం వద్ద పట్టిసీమ కాలువ నుంచి తాడిపూడి కాలువకు అనుసంధానంగా తూరలు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రైతులు గొల్లగూడెంలోని పోలవరం కుడి కాలువ గేట్ల వద్ద ధర్నా నిర్వహించారు.

ఈసందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, తాడిపూడి ఆయకట్టు రైతు మలకలపల్లి నాగ వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ, తాడిపూడి ఆయకట్టు రైతుల సమస్యలను ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉంగుటూరు, ద్వారకాతిరుమల మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో 10 వేల ఎకరాలకు పైగా సాగుభూములకు తగినంత నీరు అందడం లేదని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ కాలువ నీటిని తాడిపూడి కాలువకు మళ్లించేలా గొల్లగూడెం గేట్ల వద్ద తూరల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నాలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, సీనియర్ నాయకుడు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షుడు కోన శ్రీనివాసరావు, మండల కార్యదర్శి దాసరి సతీష్‌తో పాటు తాడిపూడి ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.