గట్టు ముసలమ్మ ఆలయంలో చోరీ

గట్టు ముసలమ్మ ఆలయంలో చోరీ

  • అర్ధరాత్రి దుండగుల దుశ్చర్య
  • తాళాలు, హుండి పగులగొట్టి నగదు అపహరణ
  • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

బయ్యారం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గుట్టల్లో వెలసిన గట్టు ముసలమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు చోరికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు సమాచారం. అనంతరం ఆలయంలో ఉన్న హుండిని ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించినట్లు తెలిసింది. శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు, నిర్వాహకులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు.

హుండిలో ఎంత మొత్తం నగదు ఉందనే విషయాన్ని ఆలయ నిర్వాహకుల ద్వారా ఆరా తీస్తున్నారు. చోరీకి పాల్పడిన వారి ఆనవాళ్లను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆలయం కొండ ప్రాంతంలో ఉండటంతో దుండగులు ముందస్తు ప్రణాళికతోనే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గట్టు ముసలమ్మ తల్లి ఆలయానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరచూ వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో చోరీ జరగడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. దుండగులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయాల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply