Cricket | డబ్ల్యూపీఎల్ తుది పోరు
Cricket | డబ్ల్యూపీఎల్ తుది పోరు
- బెంగళూరు- దిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ
- రెండో టైటిల్ కోసం బరిలోకి బెంగళూర్
- వడోదర వేదికగా మ్యాచ్
Cricket | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : హోరాహోరీ పోరాటాలతో ఫ్యాన్స్‌ను అలరిస్తున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. గురువారం వడోదర వేదికగా జరగనున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- దిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ లీగ్‌లో ఆర్సీబీ తొలి నుంచీ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకోగా, దిల్లీ పేలవంగా ప్రారంభించినా తర్వాత పుంజుకొని మరోసారి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో ఇరుజట్లు ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
రెండో టైటిల్ కోసం..
మరోవైపు ఉన్న ఆర్సీబీ అత్యంత పటిష్ఠమైన జట్టు. ఈ సీజన్లో వరుసగా ఐదు విజయాలతో అందరికంటే ముందే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. అదే జోరుతో ఆడిన ఆర్సీబీ టేబుల్లో టాపర్‌గా నిలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఫైనల్లోనూ దిల్లీపై నెగ్గి అరుదైన ఘనత సొంతం చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తుంది. ఇప్పటిదాకా డబ్ల్యూపీఎల్ మూడు సీజన్లు జరగ్గా అందులో రెండు ముంబయి (2023, 2025), ఒకసారి ఆర్సీబీ (2024) ఛాంపియన్లుగా నిలిచాయి.
ఇప్పుడు మరోసారి విజేతగా నెగ్గి అత్యధికసార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా ముంబయి సరసన నిలిచేందుకు ఆర్సీబీ ప్రయత్నిస్తుంది. స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ బలంగా ఉంది. మంధానతోపాటు రిచా ఘోష్, జార్జియా వోల్, హారిస్ వంటి బ్యాటర్లు, నదైన్ డి క్లార్క్, సాయిలి సత్ఘారే బౌలింగ్‌లో సత్తా చాటుతున్నారు.
దిల్లీ దురదృష్టం..
డబ్ల్యూపీఎల్ హిస్టరీలో దిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరడం విశేషం. దిల్లీ తొలి ఎడిషన్ నుంచి (2023, 2024, 2025, 2026) వరుసగా నాలుగుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఏ జట్టు కూడా ఇన్నిసార్లు ఫైనల్‌కు చేరలేదు. అయితే దురదృష్టవశాత్తు గతంలో ఫైనల్ చేరిన మూడుసార్లూ తుది మెట్టుపై బోల్తా కొట్టి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. దీంతో ఎలాగైనా ఈసారి డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా నిలవాలని దిల్లీ తహతలాడుతోంది.
గతంలో చేసిన తప్పిదాలను రిపీట్ చేయకుండా ఆర్సీబీని మట్టికరిపించి టైటిల్ ముద్దాడాలని దిల్లీ ఆశిస్తుంది. కొత్త కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ నాయకత్వంలో దిల్లీ బలంగానే కనిపిస్తుంది. బ్యాటింగ్‌లో లీసెల్ లీ, షఫాలీ వర్మ లారా వోల్వార్డ్ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో చినాల్ హెన్రీ, నందిని శర్మ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. మరి ఈసారైనా అందని ద్రాక్షలా ఉన్న డబ్ల్యూపీఎల్ కప్పు దిల్లీ వశం అవుతుందా? లేదా చూడాలి!
