గుంటూరు జీజీహెచ్‌లో విషాదం

గుంటూరు జీజీహెచ్‌లో విషాదం
వార్డు భవనం కిటికీ నుంచి దూకి రోగి మృతి
గుంటూరు మెడికల్, ఆంధ్రప్రభ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఓ రోగి ఆసుపత్రి భవనంలోని వాష్‌రూమ్ కిటికీ నుంచి దూకి మృతి చెందాడు. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేగింది.
పోలీసులు, ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ రావు (50) ఈ నెల 23న కిడ్నీ సమస్యతో జీజీహెచ్‌లో చేరాడు. ఆసుపత్రిలోని ఐపీ బిల్డింగ్‌లో 329వ నంబర్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. శనివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో కాలకృత్యాల కోసం వెళ్తున్నట్లు చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లిన శ్రీనివాస్ రావు, అక్కడి కిటికీ నుంచి కిందకు దూకినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తీవ్ర గాయాల పాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఘటనను గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వృత్తిరీత్యా తాపీ మేస్త్రిగా పని చేస్తున్న శ్రీనివాస్ రావు భార్య కొంతకాలం క్రితమే మృతి చెందినట్లు తెలిసింది. ఆయనకు జయంత్, లోకేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన రోగి ఈ విధంగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
