ఎస్‌సీ యువత సాధికారతకు పీఎం అజయ్..
ఎస్‌సీ యువత సాధికారతకు పీఎం అజయ్..
నైపుణ్య శిక్షణతో సుస్థిర ఉపాధికి బాటలు
ఈ నెల 19న నందిగామ, 20న తిరువూరులో మేళాలు
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : పీఎం అజయ్ పథకం ద్వారా నిరుద్యోగ ఎస్‌సీ యువతీయువకులకు ఆసక్తిగల రంగాల్లో నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవగాహన సదస్సులు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మేళాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ సదస్సులు ఎస్‌సీ యువత సాధికారతకు పునాదులు వేస్తాయని పేర్కొన్నారు. గురువారం కలెక్టరట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో పీఎం అజయ్-అవగాహన సదస్సుల నిర్వహణపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎస్‌సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ నెల 19న నందిగామ ఎంపీడీవో కార్యాలయంలో, 20న తిరువూరు ఎంపీడీవో కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు అవగాహన సదస్సు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మేళాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఎస్‌సీ నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాల్లో ఎస్‌సీ యువతకు ఆసక్తి ఉన్న రంగాలు, వారికి అవసరమైన నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి మార్గాలు, అందుబాటులో ఉన్న పథకాలు, బ్యాంకు లింకేజీ వంటి వనరులు తదితరాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.
జిల్లా పరిషత్, సాంఘిక సంక్షేమం, సాధికారత శాఖ, డీఆర్‌డీఏ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి తదితర సమన్వయ శాఖల అధికారులు సమష్టిగా కృషిచేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సమావేశంలో ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ జి.రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హర్షిత, నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
