పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయం
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 5 సీసీ కెమెరాల విరాళం
మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా ఐదు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో మేకల విజయభాస్కర్, సర్పంచ్ పాలకూరి రమాదేవి-నరసింహగౌడ్, మండల విద్యాధికారి మల్లేశం, సహాయ ఉప నిరీక్షకుడు హబీబుద్దీన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బాలప్రసాద్ తదితరులు సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసుల భద్రతతో సమానమని పేర్కొన్నారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇతర పూర్వ విద్యార్థులు కూడా ఇదే స్ఫూర్తితో పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, “మన ఊరు–మన బడి” అనే భావనతో పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కునూరెడ్డి సత్తిరెడ్డి, రత్నయ్య, అన్నపురెడ్డి, భవిత పాఠశాల చైర్మన్ పందుల ఎల్లమ్మ, గాలి సైదులు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్, పూర్వ విద్యార్థులు పెరుమాళ్ల ప్రమోద్‌కుమార్, బొల్లు సైదులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
