సాయికృష్ణ లాకప్‌డెత్‌పై వాస్తవాలు వెలికితీయాలి
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై వాస్తవాలు వెలికితీయాలి
విజయవాడ సీపీపై చర్యలు తీసుకోవాలి
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ దేవినేని అవినాష్
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిందని, ఈ ఘటనలో పూర్తి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ప్రజల భద్రత కంటే మంత్రి నారా లోకేష్‌ను మెప్పించడంపైనే దృష్టి పెట్టారని దేవినేని అవినాష్ ఆరోపించారు. సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటన పోలీసు వ్యవస్థపై తీవ్ర అనుమానాలకు తావిస్తోందని, ఈ ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరగాలని కోరారు.
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారు..
రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కాకుండా రాజకీయ ప్రేరేపిత పోలీసింగ్ కొనసాగుతోందని అవినాష్ విమర్శించారు. విజయవాడ నగరంలో ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తుందనే నమ్మకం దెబ్బతిందన్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. సాయికృష్ణను కస్టడీలో ఎలా హింసించారు, మరణానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, అనంతరం జరిగిన పరిణామాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర వేదనలో ఉన్నారని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
సీపీ ఎందుకు స్పందించడం లేదు?..
విజయవాడలో గంజాయి, అక్రమ కార్యకలాపాలు, సెటిల్మెంట్లు పెరిగిపోతున్నాయని ఆరోపించిన అవినాష్, వాటిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఒక తల్లి తన కుమారుడి మరణంతో కన్నీరుమున్నీరవుతుంటే పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై కమిషనర్ నుంచి వివరణ కోరాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ కేసును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కేవలం కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు చూపించడం కాకుండా, ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని, ఘటనపై స్వతంత్రంగా విచారణ జరిపించాలని, విజయవాడ పోలీస్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.
