వేరుశనగ విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకోండి

వేరుశనగ విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకోండి

సబ్సిడీపై విత్తనాల పంపిణీ.. రైతులకు ఏడీఏ సత్యనారాయణ సూచన

ఉరవకొండ రూరల్‌, ఆంధ్రప్రభ: ఖరీఫ్‌ సీజన్‌లో వేరుశనగ పంట సాగు చేయదలచిన రైతులు సబ్సిడీ విత్తనాల కోసం తమ పేర్లను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని ఉరవకొండ వ్యవసాయ డివిజన్‌ సహాయ సంచాలకులు సత్యనారాయణ సూచించారు.

బుధవారం మండలంలోని షేక్‌ షాన్‌పల్లి గ్రామ రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన వేరుశనగ విత్తన రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను అందజేస్తోందని తెలిపారు.

ఉరవకొండ సబ్‌ డివిజన్‌ పరిధిలో మొత్తం 6,850 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో ఉరవకొండ మండలానికి 2 వేల క్వింటాళ్లు, గుంతకల్లు మండలానికి 2,050 క్వింటాళ్లు, వజ్రకరూరు మండలానికి 2 వేల క్వింటాళ్లు, విడపనకల్లు మండలానికి 800 క్వింటాళ్లు కేటాయించినట్లు వివరించారు.

రకాల వారీగా కదిరి-6 రకం 6,100 క్వింటాళ్లు, కదిరి లేపాక్షి కేఎల్‌-1812 రకం 200 క్వింటాళ్లు, విశిష్ట రకం టీసీజీఎస్‌-1694 విత్తనాలు 550 క్వింటాళ్లు కేటాయించినట్లు తెలిపారు. విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌, మొబైల్‌ తీసుకుని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

విత్తనాల పంపిణీ సమయంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలించాలని సత్యనారాయణ సూచించారు. తేమశాతం 9 శాతం, భౌతిక శుద్ధత 96 శాతం, మొలకశాతం 70 శాతం, షెల్లింగ్‌ శాతం 70 శాతంగా ఉండేలా చూడాలన్నారు. డీ-క్రిషి యాప్‌ ద్వారా బయోమెట్రిక్‌ విధానంలో విత్తనాల రిజిస్ట్రేషన్‌, పంపిణీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏడీఏ సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో షేక్‌ షాన్‌పల్లి రైతు సేవా కేంద్ర సిబ్బంది రాజేశ్వరి, ద్రాక్షాయిని, ఆత్మ సిబ్బంది కిన్నెర, వ్యవసాయ విస్తరణ అధికారి భరత్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply