బడ్జెట్ అవుట్‌రీచ్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించాలి

బడ్జెట్ అవుట్‌రీచ్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించాలి
కర్నూలు బ్యూరో ఆంధ్రప్రభ : జిల్లాలో నిర్వహించనున్న బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమాలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బడ్జెట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌పై జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 వరకు జిల్లాలో బడ్జెట్ అవుట్‌రీచ్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్ణయించిన తేదీన జిల్లా స్థాయి సమావేశాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.
నియోజకవర్గ స్థాయి సమావేశాలను ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు, స్వర్ణాంధ్ర విజన్‌కు సంబంధించిన కీలక పనితీరు సూచికలు (KPIs) అంశాలను సమావేశాల్లో సమగ్రంగా చర్చించాలని ఆదేశించారు. అన్ని శాఖలు తమకు కేటాయించిన బడ్జెట్ వివరాలను మండలాల వారీగా సిద్ధం చేసి సీపీఓకు సమర్పించాలని సూచించారు.
జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ఖచ్చితమైన సమాచారంతో ప్రెస్ మీట్లు నిర్వహించాలని, ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సేవా రంగం అభివృద్ధి చెందితేనే తలసరి ఆదాయం పెరుగుతుందని పేర్కొంటూ, సంబంధిత శాఖలు జీడీపీ, తలసరి ఆదాయం పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సేవా రంగం, తయారీ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ బడ్జెట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ, సీపీఓ భారతి సహా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
