జీవో నెం. 8కు విరుద్ధంగా రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నియామకాలు

క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ విమర్శ

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ. ఎం.ఎస్. నెం. 8 (తేదీ: 30-06-2026)లో పేర్కొన్న నిబంధనలను పక్కనపెట్టి రాష్ట్ర విజిలెన్స్ కమిటీకి నియామకాలు చేపట్టడం ద్వారా వినియోగదారుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (సీఏపీసీఓ) చైర్మన్ జి. సురేష్ కుమార్ ఆరోపించారు. ఈ నియామకాలను వెంటనే నిలిపివేసి, జీవో నిబంధనలకు అనుగుణంగా కమిటీని పునర్వ్యవస్థీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర విజిలెన్స్ కమిటీలో వినియోగదారుల ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించే వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, ఆ స్థానాల్లో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను నియమించడం ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత, అవినీతి నిరోధం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన కమిటీల్లో నిజమైన వినియోగదారుల ప్రతినిధులను విస్మరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

ప్రభుత్వం ఇలాంటి విధానాలను కొనసాగిస్తే అవినీతి, అక్రమాలను ప్రశ్నించే అవకాశం తగ్గిపోతుందని, ఇది వినియోగదారుల హక్కులను బలహీనపరిచే చర్యగా మారుతుందని సురేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జి.ఓ. ఎం.ఎస్. నెం. 8 నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర విజిలెన్స్ కమిటీని వెంటనే పునర్వ్యవస్థీకరించి, అర్హత కలిగిన వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల సంఘాలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ హెచ్చరించారు.