కళాశాలలో చేరే ప్రతి విద్యార్థికి ఉచిత ప్రవేశంతోపాటు పాఠ్యపుస్తకాలు

మోత్కూరు, ఆంధ్రప్రభ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే విద్యార్థికి ఉచిత ప్రవేశంతో పాటు రూ. 1500 విలువచేసే పాఠ్యపుస్తకాలు అందించడం జరుగుతుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ రవీందర్ తెలిపారు. బుధవారం కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక దృష్టి సారించి అనుభవం, నైపుణ్యం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధనతోపాటు వారి అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో భాగంగా అల్పాహారం మధ్యాహ్న భోజన వసతి కల్పించడం జరుగుతుందని, బాలుర కోసం వసతి గృహ సదుపాయం కూడా అందుబాటులో ఉందన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసిన వారికి పై చదువుల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రాయితీ మొదలైన సౌకర్యాలను కల్పిస్తుందన్నారు.వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసుకోవాలని తల్లిదండ్రులను కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ బి ఉప్పలయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె నర్సింహారెడ్డి , లెక్చరర్లు ఎం పరుశురాములు, సిహెచ్ లింగస్వామి , ఏ హరికృష్ణ, వై నర్సిరెడ్డి, కే శ్యామ్ , బి పురుషోత్తం రెడ్డి, డి మంజుల, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply