సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచన

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచన

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయమని చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) జి. మన్మధ కుమార్ తెలిపారు. బాధితులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే చట్టపరంగా తక్షణమే పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని జయశ్రీ ఫంక్షన్ హాల్‌లో ‘సివియర్ డిసబిలిటీ వెల్ఫేర్ సొసైటీ’ యాదాద్రి భువనగిరి జిల్లా 14వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన గౌరీశ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కర్నాటి అనిల్ – స్వప్న దంపతుల ఆర్థిక సహాయంతో 45 మంది దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ. 2,000 విలువైన సరుకులను సీఐ మన్మధ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. వీరిలో కండరాల క్షీణత, వెన్నుముక తీవ్ర వైకల్యం ఉన్న దివ్యాంగులు ఉన్నారు.

ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ, తన బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని కార్యక్రమాలకు హాజరుకాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

అలాగే పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో దివ్యాంగుల కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సొసైటీ అధ్యక్షుడు కత్తుల బాలకృష్ణ మాట్లాడుతూ, గత 14 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు కొనసాగుతుండటం బాధ్యతను పెంచిందని తెలిపారు. దివ్యాంగులకు సేవ చేయడం సంతృప్తినిస్తోందని చెప్పారు. మనసున్న దాతల సహకారంతోనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Leave a Reply