రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై రేపు కీలక భేటీ.. కాకాణి ఏర్పాట్ల పరిశీలన

నెల్లూరు, ఆంధ్రప్రభ: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి నిర్వహించనున్న టాస్క్ ఫోర్స్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు.

నెల్లూరు నగరంలోని డీఆర్ ఉత్తమ్ హోటల్‌లో సోమవారం (జూలై 13) ఉదయం 10 గంటలకు టాస్క్ ఫోర్స్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశ వేదికను సందర్శించిన కాకాణి, ఏర్పాట్లను సమీక్షించి సంబంధిత నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని కాకాణి తెలిపారు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ ఫోర్స్ ప్రోగ్రాం కన్వీనర్ సాకే శైలజానాథ్, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, టాస్క్ ఫోర్స్ సభ్యులు సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు.