S Janaki | ఎస్. జానకికి రాహుల్ గాంధీ నివాళి

‘ఆమె స్వరం తరతరాల భారతీయులను అలరించింది’..

S Janaki | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రముఖ గాన కోకిల ఎస్. జానకి మృతిపట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించిన ఆయన, జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. “దక్షిణ భారతదేశపు కోకిల ఎస్. జానకి గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె స్వరం తరతరాల భారతీయులకు ప్రేమ, భక్తి, ఆనందం, విరహానికి ప్రతీకగా నిలిచింది” అని రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.

బహుభాషల్లో తన అపూర్వ గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న జానకి, సంగీతం అనే విశ్వభాష ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలను ఏకం చేశారని ఆయన కొనియాడారు. ఎస్. జానకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాహుల్ గాంధీ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.