జూలై 10 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి..
- ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు వేముల నాగరాజు
మోత్కూర్, ఆంద్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్య హక్కును పరిరక్షించాలని కోరుతూ ఈనెల 10వ తేదీన ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్ ఎఫ్ ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వేముల నాగరాజు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో విద్యార్థులు తీవ్రమైన మౌలిక సదుపాయాల కొరతతో పాటు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు నెలల తరబడి విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువును కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.స్కాలర్షిప్ బిక్ష కాదు ,విద్యార్థుల హక్కు అని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలురకు మరుగుదొడ్లు నిర్మించాలని, తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్, తరగతి గదులు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల నుండి మోత్కూర్ మండల కేంద్రానికి చదువుకోడానికి వచ్చే విద్యార్థుల కోసం అనుకూల సమయాల్లో ఆర్టీసీ బస్సులను నడపాలని, విద్యార్థుల భద్రత దృష్ట్యా కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విద్యార్థుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం చేపడుతున్న ఈ ఉద్యమంలో భాగంగా ఈనెల 10వ తేదీన నిర్వహించే విద్యాసంస్థల బంద్‌లో ప్రతి విద్యార్థి స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మోత్కూర్ మండల నాయకులు రోహిత్,చరణ్ , అనిల్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు.
