Police Officer | పోలీసు అధికారిపై ఆగ్రహం
మనవరాలిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టిన అధికారి..
అడ్డుకున్న స్థానికులతో వాగ్వాదం..
ఘటనతో భారీ ట్రాఫిక్ జామ్
Police Officer | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఓ పోలీసు అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఆరేళ్ల మనవరాలిని కారు స్టీరింగ్ వద్ద కూర్చోబెట్టి వాహనం నడిపించిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కారణంగా కొంతసేపు రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
స్థానికుల కథనం ప్రకారం, టీఎస్ 07 జీపీ 7450 నంబర్ గల కారు అస్తవ్యస్తంగా వెళ్తుండటంతో అనుమానం వచ్చిన వాహనదారులు కారును అడ్డగట్టారు. ఆ సమయంలో డ్రైవింగ్ సీటులో ఆరేళ్ల బాలిక ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. మైనర్‌కు కారు ఎలా నడిపిస్తున్నారని ప్రశ్నించగా, బాలిక “నా తాత పోలీస్.. మీకేంటి?” అని సమాధానం ఇచ్చినట్లు అక్కడున్న వారు తెలిపారు.
అనంతరం అక్కడే ఉన్న పోలీసు అధికారి స్థానికులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తన తప్పును అంగీకరించకుండా, ప్రశ్నించిన వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మైనర్‌కు వాహనం నడిపించడం మోటారు వాహనాల చట్టానికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే అవకాశముందని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని వారు మండిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, సంబంధిత పోలీసు అధికారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారికంగా పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
