Oman Ship Attack | 10 మంది భారతీయులు సురక్షితం, ఒకరు గల్లంతు
హర్మూజ్ జలసంధిలో ‘జీఎఫ్‌ఎస్ గెలాక్సీ’పై దాడి..
ఘటనను ఖండించిన భారత్..
గల్లంతైన నావికుడి కోసం ముమ్మర గాలింపు
Oman Ship Attack | ఆంధ్ర్రప్రభ వెబ్‌డెస్క్ : ఒమన్ తీరం సమీపంలోని హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ‘జీఎఫ్‌ఎస్ గెలాక్సీ’ వాణిజ్య నౌకపై జరిగిన దాడి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో నౌక ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ప్రాణాల రక్షణ కోసం నౌకను అత్యవసరంగా విడిచిపెట్టాల్సి వచ్చింది.
నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులు ఉండగా, వారిలో 10 మందిని సురక్షితంగా రక్షించారు. అయితే మరో భారతీయ నావికుడు గల్లంతయ్యాడు. అతడి కోసం ఒమన్ అధికారులతో కలిసి భారత విదేశాంగ శాఖ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకల భద్రతకు భంగం కలగడం ఆందోళనకరమని పేర్కొంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని భారత్ స్పష్టం చేసింది.
