S Janaki Funeral | ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు

S Janaki Funeral | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రముఖ గాన కోకిల ఎస్. జానకి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం మైసూరులో జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూరులోని మహారాజా కాలేజ్ మైదానంలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మైసూరు సమీపంలోని ఆమెకు చెందిన ప్రైవేట్ ఫామ్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

జానకి అంత్యక్రియలను మైసూరులో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. జీవితంలో చివరి దశను ప్రశాంతంగా మైసూరులోనే గడపాలన్నది ఆమె చిరకాల కోరిక అని, అందుకోసమే మైసూరు సమీపంలోని కణియనహుండి ప్రాంతంలో స్థలాన్ని కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఆమె ఆకాంక్షకు అనుగుణంగా మైసూరులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆమెకు అంతిమ వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సహా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించిన ఎస్. జానకికి అభిమానులు, సినీ ప్రముఖులు తుది నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.