yadagiri gutta ప్రమాణ స్వీకారంలో…

ముందస్తు సమాచారం ఇచ్చినా తప్పని ఘోర అవస్థలు

వరుస సెలవులతో పోటెత్తిన జనానికి తప్పని తిప్పలు!
కొండపైకి వాహనాల నిలిపివేతతో వృద్ధులు, పిల్లలకు ఇబ్బందులు
కోనేట్లో నీళ్లు లేక కాలకృత్యాలకు భక్తుల అవస్థలు
ప్రమాణ స్వీకారం ముగిసేవరకు ‘నరసింహుడి’ దర్శనాలు బంద్

దర్శనం కాక, కిందకు వెళ్లలేక ఘాట్ రోడ్డుపైనే ప్రహసనం!

ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం దేవస్థానంలో వైభవంగా జరిగినప్పటికీ, అదే సమయంలో స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులకు మాత్రం ఈ కార్యక్రమం తీవ్ర నరకాన్ని మిగిల్చింది.

శనివారం ఉదయం సరిగ్గా 11 గంటల 37 నిమిషాలకు ప్రమాణ స్వీకారం నిర్వహించేందుకు వీలుగా ఆలయ అధికారులు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 9.00 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరిమితం చేస్తూ, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు స్వామివారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, అలాగే నిత్యకల్యాణాన్ని ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహిస్తామని ముందుగానే ప్రకటన విడుదల చేశారు.

దేవస్థానం ఈ సమయ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే విడుదల చేసినప్పటికీ, వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఊహించని స్థాయిలో కొండకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళికలు, క్షేత్రస్థాయి ఏర్పాట్లు లోపించడంతో ఆలయానికి వచ్చిన సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కొండపైకి ప్రైవేటు, ఇతర వాహనాలను అనుమతించబోమని అధికారులు ఆంక్షలు విధించడంతో, కొండ కిందికి చేరుకున్న వేలాది మంది భక్తులకు పైకి వెళ్లేందుకు వాహనాలు దొరకలేదు. కాలినడకన వెళ్లలేని వారు ఘాట్ రోడ్డుపైనే గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

అదే సమయంలో కొండ కింద ఉన్న కోనేరులో కనీసం స్నానాలు చేయడానికి కూడా నీరు లేకపోవడంతో, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి, పుణ్యస్నానాలు ఆచరించడానికి పడరాని పాట్లు పడ్డారు.

ప్రమాణ స్వీకారం ముగిసేంతవరకు కొండపై ఉన్న సామాన్య భక్తులకు ఎలాంటి దర్శనాలు కల్పించకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వీఐపీల ప్రమాణ స్వీకారం కోసం ఏకంగా రెండు గంటల పాటు (ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు) దేవుడి దర్శనాన్ని పూర్తిగా నిలిపివేయడం ఏమిటని, భక్తులను దేవుడికి దూరం చేయడం సమంజసమేనా అని పలువురు ఘాటుగా ప్రశ్నించారు.

కనీసం ఉదయం 11 గంటల లోపు స్వామివారిని దర్శించుకున్న భక్తులనైనా సురక్షితంగా, వేగంగా కొండ కిందికి చేర్చేందుకు దేవస్థానం ఎలాంటి రవాణా సౌకర్యాలు కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని భక్తులు విమర్శించారు.

ఎండ తీవ్రత, ఉక్కపోత మధ్య చిన్న పిల్లలు, నడవలేని వృద్ధులతో కలిసి ఘాట్ రోడ్డుపై గంటల తరబడి నిలిచిపోయామని, కనీసం తాగునీరు, కూర్చోవడానికి నీడ కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని భక్తులు కన్నీరుమున్నీరయ్యారు.

నూతన పాలక మండలి కొలువుదీరుతున్న తొలి రోజే భక్తుల సౌకర్యాలను గాలికొదిలేసి, కేవలం హంగు, ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై స్థానికులు, భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముందస్తు సమాచారం ఇచ్చినట్లు కాగితాల్లో చూపించుకోవడం కాదు, క్షేత్రస్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఆలయ యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.