చెన్నూరులో గురుకుల విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఆందోళన
చెన్నూరు, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం నుంచి విద్యార్థి పాఠశాలలో కనిపించడం లేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం, చెన్నూరు మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్గం హరికిషన్, మమత దంపతుల కుమారుడు దుర్గం హర్ష గత మూడు సంవత్సరాలుగా ఈ గురుకుల పాఠశాలలోనే చదువుకుంటున్నాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి అభ్యసిస్తున్న హర్ష గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో పాఠశాల సిబ్బంది గాలింపు చేపట్టారు.
విద్యార్థి కనిపించడం లేదని గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే పాఠశాలకు చేరుకుని కుమారుడి ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థి ఆచూకీ కోసం సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యం చర్యలు చేపట్టినట్లు సమాచారం.
