గురుకులాల అవినీతి ఆరోపణ.. చర్చకు సిద్ధమైన మంత్రులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: గురుకులాల్లో అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం 9.45 గంటలకు సీఎల్పీ కార్యాలయానికి ముగ్గురు మంత్రులు చేరుకోనున్నారు.
అనంతరం అక్కడి నుంచి గన్‌పార్క్‌కు వెళ్లి తమ వైఖరిని వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న మాజీ మంత్రులు ఎవరైనా చర్చకు ముందుకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని మంత్రులు ప్రకటించారు.
మాజీ మంత్రులు చర్చకు అంగీకరిస్తే, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బహిరంగంగా చర్చ నిర్వహించేందుకు కూడా సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ వెల్లడించారు. గురుకులాల వ్యవహారంపై రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న వేళ మంత్రుల తాజా ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
