వాన కోసం ఎదురుచూపులు.. స్ప్రింక్లర్లతో పత్తి మొక్కలను కాపాడుతున్న రైతులు

చిట్యాల, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు, కురిసిన స్వల్ప వర్షాలతో నాటిన పత్తి విత్తనాల్లో సుమారు 50 శాతం మాత్రమే మొలకెత్తడంతో ఆ మొక్కలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

బావులు, బోర్ల నుంచి స్ప్రింక్లర్ పైపుల ద్వారా నీటిని అందిస్తూ పత్తి మొక్కలు ఎండిపోకుండా రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. వానాకాలం ప్రారంభంలోనే పంటను బతికించుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరుణుడు కరుణించి త్వరలో మంచి వర్షాలు కురిపించాలని, అప్పుడే పంటలు గట్టెక్కే పరిస్థితి ఉంటుందని మండల రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.