డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్..

  • 200 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు
  • కిలో బంగారం, నగదు స్వాధీనం..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా, సీనియర్ డీఎస్పీ భీంరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు సంబంధించిన అక్రమాస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అధికారికంగా గుర్తించినట్లు సమాచారం.

గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఎస్పీ భీంరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

కిలో బంగారం, నగదు స్వాధీనం

సోదాల్లో భాగంగా డీఎస్పీ నివాసం నుంచి కిలో బంగారం, రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే విలువైన ఆస్తి పత్రాలు, బ్యాంకు లాకర్ల వివరాలు, పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే, భీంరెడ్డికి చెందిన 16 ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్ పరిసరాల్లో విలాసవంతమైన విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, వాణిజ్య భవనాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బినామీల పేరిట ఉన్న ఆస్తులపై కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వెలుగుచూసిన భారీ స్థిరాస్తులు

సోదాల్లో భారీ ఎత్తున స్థిరాస్తుల పత్రాలు లభించాయి. వాటిలో ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో విల్లా, టెలికాం నగర్‌లో జీ+2 భవనం, పెంట్‌హౌస్, మరో ఫ్లాట్, గచ్చిబౌలిలో ఫ్లాట్, మణికొండలో జీ+5 కమర్షియల్ కాంప్లెక్స్‌లో 500 గజాల వాటా, 3,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, తెల్లాపూర్‌లో రెండు ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరు దేవనహళ్లిలో ఒక ఎకరం భూమి, నాగోల్, పటాన్‌చెరు, మొమిన్‌పేట్ ప్రాంతాల్లో పలు స్థలాలు, మొమిన్‌పేట్‌లో మరో 2 ఎకరాల వ్యవసాయ భూమి, ముచింతల్‌లో 4.20 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదనంగా శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ సంస్థలో రూ.75 లక్షల పెట్టుబడి పెట్టినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.

మార్కెట్ విలువ మరింత ఎక్కువే..

పత్రాల్లో నమోదైన విలువతో పోలిస్తే ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ అనేక రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఆస్తుల అసలు విలువ, ఆదాయ వనరులు, బినామీ లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోంది.

విదేశీ మద్యం బాటిళ్లు కూడా స్వాధీనం

సోదాల్లో భాగంగా సంబంధిత అధికారిక నివాసం నుంచి 23 విదేశీ మద్యం బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. ఈ అంశంపై తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ శాఖకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.

బినామీల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

భీంరెడ్డి సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఆస్తుల అసలు విలువ, అక్రమ లావాదేవీలపై అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఏసీబీ అధికారులు పూర్తి విచారణ అనంతరం స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.