సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన డీఐజీ మాధవి

నర్సాపురం, ఆంధ్రప్రభ: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ), ఏలూరు ఎన్. మాధవి నర్సాపురం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌ రిజిస్ట్రార్ ఎం. జీవన్‌బాబు, సీనియర్ అసిస్టెంట్ నిరంజన్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో అందిస్తున్న సేవలు, కార్డ్ ప్రాజెక్టు నిర్వహణ, రికార్డు గదిని పరిశీలించిన డీఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు.

మీడియాతో మాట్లాడిన డీఐజీ మాధవి.. మార్కెట్ విలువల హెచ్చుతగ్గులకు (ఎనామిలి) సంబంధించి వచ్చిన అర్జీల పరిశీలనలో భాగంగానే నర్సాపురం పర్యటన చేపట్టినట్లు తెలిపారు. పలు గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూములను ఇళ్ల స్థలాలుగా నమోదు చేయడంతో మార్కెట్ విలువలను తగ్గించాలని వచ్చిన వినతులను పరిశీలిస్తున్నామని, ఇందులో భాగంగా నర్సాపురం మండలం లింగబోయినచర్ల గ్రామాన్ని కూడా సందర్శించినట్లు చెప్పారు.

రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు తావులేకుండా కార్డ్ ప్రాజెక్టు ద్వారా పటిష్ట చర్యలు చేపట్టామని, ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డీఐజీ పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల జాబితాను ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె వెల్లడించారు.