మంగినపూడిలో 63 అడుగుల మట్టి గణేశుడికి శంకుస్థాపన..
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో నిర్వహించనున్న శ్రీ గణేశ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించనున్న 63 అడుగుల ఎత్తైన సహజ మట్టి శ్రీ గణేశ మహారాజ్ విగ్రహంతో పాటు పలు ఉపాలయాల నిర్మాణానికి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యం కల్పించే బోర్‌వెల్ పనులను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నం గత వైభవాన్ని పునరుద్ధరించడంతో పాటు బందరును రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంగినపూడి బీచ్ అభివృద్ధితో మచిలీపట్నం అమరావతి గేట్‌వేగా రూపుదిద్దుకుంటుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న పోర్టు నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా సాగాలని విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరారు.
63 అడుగుల సహజ మట్టి గణేశ విగ్రహంతో పాటు పలు ఉపాలయాల ఏర్పాటుతో ఈ ఏడాది గణేశ నవరాత్రి ఉత్సవాలను రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
