తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- మూడు గంటలపాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- విద్య, వైద్యానికి పెద్దపీట
- టిమ్స్‌లో 6,278 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
- మూసీ అభివృద్ధికి రూ.7,345 కోట్లు..
- విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై ఫోకస్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి పేపర్‌లెస్ కేబినెట్ సమావేశం జరిగింది. కాగితపు ఫైళ్లకు బదులుగా పూర్తిగా డిజిటల్ విధానంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడం విశేషం. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపు మూడు గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
టిమ్స్ లో 6,278 పోస్టుల మంజూరు
రాష్ట్రంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అవసరమైన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, ఇతర వైద్య సిబ్బంది పోస్టులను మంజూరు చేసింది.
రోగులకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలు అందించేందుకు మొత్తం 6,278 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, 4,235 ఔట్సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈ టిమ్స్ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేదలకు అవసరమైన వైద్య సేవలు అందేలా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీలు) మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మూసీ రివర్ ఫ్రంట్ కు రూ.7,345 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఫేజ్–1 పనులకు తెలంగాణ మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో భాగంగా 21 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులకు రూ.7,345.12 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ పనులు హిమాయత్‌సాగర్ నుంచి ఈసా నది కలిసే ప్రాంతం, ఉస్మాన్‌సాగర్ నుంచి మూసీ ప్రవాహ మార్గం ప్రారంభమయ్యే ప్రాంతం వరకు బాఫూఘాట్ వరకు చేపట్టనున్నారు. నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఆధునిక నగర మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది.
ప్రాజెక్టు అమలు, నిర్వహణ కోసం కొత్తగా 147 పోస్టుల సృష్టికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదనంగా అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వినియోగించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ నది పునరుద్ధరణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా హైదరాబాద్‌కు కొత్త రూపం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
గిడ్డంగుల సంస్థకు 60 ఎకరాల భూమి
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (టీజీఎస్‌డబ్ల్యూసీ)కు రెండు జిల్లాల్లో మొత్తం 60 ఎకరాల భూమిని మార్కెట్ ధర ప్రకారం కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయం ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కాలపహాడ్ గ్రామంలో 10 ఎకరాల భూమిని గోదాముల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూసీకి కేటాయించనున్నారు. ఈ భూముల్లో నిత్యావసర వస్తువుల నిల్వ కోసం ఆధునిక గోదాములు నిర్మించనున్నారు. దీంతో ఆహార ధాన్యాలు, ఇతర అవసరమైన వస్తువుల నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు సరఫరా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు భూములు
రాష్ట్రంలో కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుకు తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భూములను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు కోసం కేటాయించారు.
అదేవిధంగా జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆయా జిల్లాల్లో నాణ్యమైన కేంద్ర విద్య అందుబాటులోకి రావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్ర చట్టంపై అసంతృప్తి.. సుప్రీంకోర్టులో సవాల్‌కు సిద్ధం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం అమలుపై తెలంగాణ మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా కేంద్రం ఈ చట్టాన్ని తీసుకురావడంపై కేబినెట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చట్టంలోని పలు నిబంధనలు రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపేలా ఉన్నాయని అభిప్రాయపడింది.
కూలీలకు ఉపాధి భరోసా కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో మార్పులు చేయవద్దని ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని మంత్రివర్గం గుర్తు చేసింది. ఈ అంశంపై మరోసారి కేంద్రానికి రాష్ట్ర అభ్యంతరాలను అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించింది.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఉపసంఘం సమర్పించిన నివేదికను మంత్రివర్గం పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపే విధంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఏకపక్షంగా ఈ చట్టాన్ని అమలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఉపసంఘం చేసిన సిఫారసులపై చర్చించింది.
ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలు ఈ కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాయా అనే విషయాన్ని అధికారులు మంత్రివర్గానికి వివరించారు. అన్ని రాష్ట్రాలు కొత్త చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. దీంతో ఉపాధి హామీ కూలీలకు పనులు నిలిచిపోకుండా చూడాలనే ఉద్దేశంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో 2026 జూలై 1 నుంచి తెలంగాణలో కూడా వీబీజీ రామ్‌జీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
అయితే చట్టంలోని కొన్ని నిబంధనలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, అలాగే పార్లమెంట్‌లోనూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్త చట్టం అమలును కొనసాగిస్తూనే, దానిపై న్యాయపరమైన పోరాటం కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
టీచర్లకూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర సిబ్బందికీ అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు నాణ్యమైన, పోషకాహారం అందించడంతో పాటు పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేయడం వల్ల ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని కేబినెట్ తెలిపింది.
ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అమలవుతున్న పోషకాహార పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
కొండా సురేఖ గైర్హాజరుకు కారణమా అదేనా ?
ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.
అయితే, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాల వల్ల కేబినెట్ సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు ఆమె కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) సమాచారం అందినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల విషయంలో తనకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారనే అసంతృప్తితోనే మంత్రి కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
