అర్థరాత్రి గొడ్డలితో హత్యాయత్నం..
కుటుంబ సభ్యుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
వ్యక్తిగత విభేదాలే దాడికి కారణమని సమాచారం
ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజుపై గొడ్డలితో దాడి చేసిన రమేష్‌బాబు
కుటుంబ సభ్యుల అడ్డుకోవడంతో తప్పించుకున్న బాధితుడు
కానిస్టేబుల్ సహాయంతో ఆస్పత్రికి తరలింపు
తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స
తిరువూరు, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం వావిలాల గ్రామంలో అర్థరాత్రి జరిగిన గొడ్డలి దాడి కలకలం రేపింది. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో దుగ్గిరాల నాగరాజుపై దుగ్గిరాల రమేష్‌బాబు హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజుపై రమేష్‌బాబు గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అప్రమత్తమై అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలో ఉన్న కానిస్టేబుల్ సహాయంతో తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నాడు. దాడిలో నాగరాజుకు స్వల్ప గాయాలు కాగా, ప్రస్తుతం తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. వ్యక్తిగత విభేదాలే దాడికి కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
