మోత్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాచకొండ బాలరాజు గౌడ్
మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పాటిమట్ల గ్రామానికి చెందిన రాచకొండ బాలరాజు గౌడ్‌ను నియమిస్తూ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య ప్రతిపాదనల మేరకు ఈ నియామకం జరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాలరాజు గౌడ్ మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వంగాల సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమితులవడంతో ఆయన స్థానంలో బాలరాజు గౌడ్‌కు బాధ్యతలు అప్పగించారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన బాలరాజు గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
తన నియామకానికి సహకరించిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని మహేష్ కుమార్ గౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్ల అయిలయ్యతో పాటు జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులకు బాలరాజు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
