నిబద్ధతతో పని చేయండి..

  • గ్రూప్-1 అధికారులకు సీఎస్ సంజయ్ జాజు సూచన
  • ప్రభుత్వ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషించాలని పిలుపు

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు, ఐఏఎస్‌ను తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్ ఆధ్వర్యంలో అలోక్ కుమార్, సర్వేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ తదితర అధికారులు సీఎస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ, ప్రతి అధికారి పని పట్ల అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో కూడా గ్రూప్-1 అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ప్రజా సేవే ప్రధాన ధ్యేయంగా భావించి పారదర్శకత, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో గ్రూప్-1 అధికారుల పాత్ర మరింత ప్రభావవంతంగా ఉండేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.