మార్నింగ్ వాక్‌లోనే పారిశుధ్య తనిఖీలు..
స్వచ్ఛ పెద్దపల్లికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పిలుపు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. మినీ ట్యాంక్‌బండ్‌పై వాకింగ్ చేస్తూ ఎల్లమ్మ, గుండమ్మ చెరువుల పరిసరాలను పరిశీలించి వాకర్లకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
అనంతరం ఉదయాన్నే మున్సిపల్ కార్మికులు చేపడుతున్న పారిశుధ్య పనులను స్వయంగా తనిఖీ చేశారు. జెండా చౌరస్తా, చందపల్లి రోడ్డులో పర్యటించిన ఆయన వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డు అధికారులు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
పట్టణ ప్రజలు ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు. రోడ్లు, మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి మున్సిపల్ చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
స్వచ్ఛ పెద్దపల్లి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి, పులిపాక రాజు, ట్యాంక్‌బండ్ ఇన్చార్జి వునుకొండ మధు, జవాన్లు జయరాజ్, కరుణాకర్, మోహన్, చిన్న, వేణులాల్ తదితరులు పాల్గొన్నారు.
