రైతుల విద్యుత్ సమస్యకు పరిష్కారం.. 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని బొక్కలోనిపల్లి గ్రామ రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చొరవతో పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేశారు.

చాలా రోజులుగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుతో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోవింద్ యాదవ్, ఏఈ నర్సిరెడ్డి, విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ సలీం, లైన్‌మ్యాన్ చెన్నయ్య, రైతులు పాల్గొన్నారు.