భారత్-జపాన్ బంధాలకు కొత్త ఊపు..
- ఏఐ, రక్షణ, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు
- ప్రధాని మోదీ-జపాన్ ప్రధాని సనాయే తకైచి భేటీ..
- ఆర్థిక భద్రత, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలపై దృష్టి
ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూర్చేలా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. న్యూఢిల్లీలో గురువారం జరిగిన 16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, రక్షణ, ఇంధనం, ఆర్థిక భద్రత, కీలక ఖనిజాలు, ఆరోగ్య రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయించారు.
తకైచి జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ఇదే తొలి అధికారిక పర్యటన కావడం విశేషం. ఆమెకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ, భారత్-జపాన్ సంబంధాలు శతాబ్దాల నాగరికతల అనుబంధంతో పాటు పరస్పర విశ్వాసంపై నిర్మితమయ్యాయని పేర్కొన్నారు.
ఇరు దేశాలు ముఖ్యంగా కృత్రిమ మేధ, సెమీకండక్టర్ తయారీ, సరఫరా గొలుసుల భద్రత, కీలక ఖనిజాల సరఫరా, రక్షణ సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య రంగం తదితర అంశాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని అంగీకరించాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, సాంకేతిక స్వావలంబన పెంపు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేయాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు.
భవిష్యత్ సాంకేతికత, ఆర్థిక భద్రత, ప్రాంతీయ వ్యూహాత్మక సహకారంలో భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచి ద్వైపాక్షిక చర్చలు జరిపి కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, క్వాంటం టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు.
జపాన్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు వచ్చిన తొలి అధికారిక పర్యటన ఇదేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. “జపాన్ తొలి మహిళా ప్రధాని, దూరదృష్టి కలిగిన ప్రజాదరణ పొందిన నాయకురాలు సనాయే తకైచికి భారత్‌కు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. భారత-జపాన్ బౌద్ధ వారసత్వానికి కేంద్రంగా ఉన్న నారా ప్రాంతానికి ఆమె చెందినవారు కావడం ప్రత్యేకత” అని మోదీ అన్నారు.
ఏఐలో కలిసి ముందడుగు…
ఈ సదస్సులో కృత్రిమ మేధ ప్రధాన అజెండాగా నిలిచింది. ఏఐ రంగంలో సహకారం పెంపొందించేందుకు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడంతో పాటు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. “భారత్-జపాన్ భాగస్వామ్యంలో సాంకేతిక సహకారమే అత్యంత బలమైన స్తంభంగా మారుతుందని మేము విశ్వసిస్తున్నాం. భారత ఏఐ వ్యవస్థలోని పలు కీలక సంస్థలు జపాన్ భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జపాన్ ఖచ్చితత్వ సాంకేతికత, భారత సాఫ్ట్వేర్ సామర్థ్యాలు కలిస్తే ప్రపంచ ఏఐ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, కీలక ఖనిజాలు, ఆధునిక తయారీ రంగం, తదుపరి తరం రవాణా వ్యవస్థలలో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భవిష్యత్తులో ఆర్థిక భద్రత, సరఫరా గొలుసుల స్థిరత్వానికి ఇవి అత్యంత కీలక రంగాలని ఇరు దేశాల నాయకులు అభిప్రాయపడ్డారు.
రక్షణ రంగంలో తొలి సంయుక్త ప్రాజెక్టు
రక్షణ రంగంలో కూడా భారత్-జపాన్ సంబంధాలు మరో మెట్టు ఎక్కాయి. ‘యూనికార్న్’ నౌకాదళ రేడియో యాంటెన్నా అభివృద్ధికి సంబంధించిన తొలి సంయుక్త రక్షణ ప్రాజెక్టుపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. “ఈ ప్రాజెక్టు భారత్-జపాన్ రక్షణ సాంకేతిక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ప్రాంతీయ శాంతి, సముద్ర భద్రత, నియమాధారిత అంతర్జాతీయ వ్యవస్థను బలోపేతం చేసే రక్షణ సాంకేతికతలను ఇకపై సంయుక్తంగా అభివృద్ధి చేస్తాం” అని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం
ఔషధాలు, వైద్య పరికరాలు, బయోటెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ భాగస్వామ్యం ప్రపంచ ఆరోగ్య భద్రతకు దోహదపడుతుందని ప్రధాని మోదీ తెలిపారు. “భారత్‌కు ఉన్న భారీ ఉత్పత్తి సామర్థ్యం, జపాన్‌కు ఉన్న అత్యున్నత నాణ్యత కలిస్తే ప్రపంచానికి తక్కువ ధరలో నమ్మకమైన, అత్యాధునిక ఆరోగ్య సేవలను అందించగలుగుతాం” అని ఆయన పేర్కొన్నారు.
10 ట్రిలియన్ యెన్ పెట్టుబడుల లక్ష్యం
భారత్‌లో జపాన్ పెట్టుబడులను భారీగా పెంచేందుకు ఇరు దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. వచ్చే పదేళ్లలో 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడులను భారత్‌కు తీసుకురావడంతో పాటు, దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. గత ఏడాది కాలంలోనే భారత్-జపాన్ సంస్థల మధ్య సుమారు 120 కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరాయని, వాటి ద్వారా 10 బిలియన్ డాలర్లకు పైగా జపాన్ పెట్టుబడులు భారత్‌కు రానున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు.
1,000 బయోగ్యాస్ ప్లాంట్లు
ఇంధన భద్రత, స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత్-జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 1,000 బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమం గ్రామీణ ఉపాధి, స్వచ్ఛ ఇంధనం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు దేశ ఇంధన భద్రతను కూడా బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇండో-పసిఫిక్‌కు ప్రాధాన్యం
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, నియమాధారిత అంతర్జాతీయ వ్యవస్థను బలోపేతం చేయడంపై కూడా ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. “భారత్, జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య, మార్కెట్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. స్వేచ్ఛాయుత, సంపన్న, నియమాధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతం మా ఉమ్మడి లక్ష్యం. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు మొత్తం ప్రాంత అభివృద్ధి, శాంతి, స్థిరత్వానికి దోహదపడతాయి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సహకారంతో ప్రారంభమైన భారత్-జపాన్ సంబంధాలు ఇప్పుడు సాంకేతికత, రక్షణ, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, ప్రాంతీయ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకోవడం ఈ సదస్సు ప్రత్యేకతగా నిలిచింది.
