India-Japan | వన్ ఇయర్ లో రూ.1 ట్రిలియన్ పెట్టుబడులు
- భారత్-జపాన్ మధ్య భారీ ఒప్పందాలు..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భారత్–జపాన్ ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరో మెట్టు ఎక్కింది. 2025 ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 120కు పైగా అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి. వీటి ద్వారా దాదాపు రూ.1 లక్ష కోట్ల (రూ.1 ట్రిలియన్) పెట్టుబడులు భారత్‌లోకి రానున్నాయి. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ, హరిత ఇంధనం, తయారీ, ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాల్లో ఈ పెట్టుబడులు వినియోగించనున్నారు.
మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయె తకాచి గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన 16వ భారత్–జపాన్ వార్షిక సదస్సులో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. సాంకేతికత, రక్షణ, ఇంధన భద్రత, సరఫరా గొలుసు బలోపేతం, పెట్టుబడుల విస్తరణ తదితర అంశాలపై రెండు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, రాబోయే పదేళ్లలో భారత్‌లో 10 ట్రిలియన్ యెన్ల (సుమారు రూ.6 లక్షల కోట్లకు పైగా) జపాన్ పెట్టుబడులను ఆకర్షించడం, అలాగే భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడం తమ ఉమ్మడి లక్ష్యమని వెల్లడించారు.
గత ఏడాది కాలంలోనే దాదాపు 120 కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరాయని, వాటి ద్వారా 10 బిలియన్ డాలర్లకు పైగా జపాన్ పెట్టుబడులు భారత్‌కు వచ్చే అవకాశముందని మోదీ తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక సహకారం మరింత బలోపేతం కానుందని ఆయన పేర్కొన్నారు.
హరిత ఇంధనం, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, క్వాంటమ్ టెక్నాలజీ, రక్షణ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన రంగాలపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారించడం విశేషం. ఈ సహకారంతో భారత్–జపాన్ సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరుతాయని ఇరు దేశాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏఏ రంగాల్లో పెట్టుబడులు?
హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు : జపాన్‌కు చెందిన ఇటోచు కార్పొరేషన్–ఎల్ అండ్ టీ కలిసి కాండ్లా పోర్టులో 3 లక్షల టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును రూ.18,900 కోట్లతో చేపట్టనున్నాయి. ఐహెచ్ఐ–ఏసీఎంఈ సంయుక్తంగా 4 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం రూ.29,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. మిత్సుబిషి గ్యాస్ కెమికల్–ఏసీఎంఈ కలిసి గ్రీన్ మెథనాల్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు సుమిటోమో కార్పొరేషన్ పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అస్సాంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు సుజుకి ఆర్అండ్డీ, ఎన్డీడీబీ, ఎన్ఈడీఎఫ్ భాగస్వామ్యం కుదిరింది.
సెమీకండక్టర్లు, అంతరిక్ష రంగంలో భాగస్వామ్యం : భారత్‌లో సెమీకండక్టర్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు టోహో కోకి–ఐఐటీ గువాహటి కలిసి పనిచేయనున్నాయి. ఫుజీఫిల్మ్ గుజరాత్లో సెమీకండక్టర్ మెటీరియల్స్ తయారీకి పెట్టుబడులు పెట్టనుంది. చంద్రుడిపై సంయుక్త పరిశోధనల కోసం ఐస్పేస్–డిజాంతరా మధ్య భాగస్వామ్యం కుదిరింది.
ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీల్లో కొత్త అవకాశాలు : ఎన్టీటీ డేటా–పర్సిస్టెంట్ సిస్టమ్స్ కలిసి తదుపరి తరం టెలికాం టెక్నాలజీల అభివృద్ధిపై పనిచేయనున్నాయి. రూ.3,800 కోట్లతో సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్టును కూడా ఎన్టీటీ డేటా చేపట్టనుంది. యాకుమో–ఐఐఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నాయి. మిత్సుబిషి ఎలక్ట్రిక్–ఐఐటీ హైదరాబాద్ కలిసి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

ఆటోమొబైల్, ఉక్కు, తయారీ రంగాల్లో విస్తరణ : టయోటా మహారాష్ట్రలోని బిడ్కిన్ ప్రాంతంలో ఏడాదికి లక్ష వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 2,800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సుజుకి కొత్త ప్లాంట్ కోసం రూ.5,000 కోట్లతో భూమి కొనుగోలు చేయనుంది. జేఎఫ్‌ఈ స్టీల్–జేఎస్‌డబ్ల్యూ కలిసి రూ.16,000 కోట్లతో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్నాయి. హర్యానాలో సుమిటోమో కార్పొరేషన్, డైకిన్ కూడా పలు పారిశ్రామిక, పరిశోధన ప్రాజెక్టులను చేపట్టనున్నాయి.
బ్యాంకింగ్, స్టార్టప్‌లకు ఊతం : జపాన్‌కు చెందిన ఎంయూఎఫ్‌జీ బ్యాంక్–శ్రీరామ్ ఫైనాన్స్ మధ్య రూ.40,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం కుదిరింది. ఎస్ఎంబీసీ–యెస్ బ్యాంక్ మధ్య రూ.17,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం జరిగింది. దీంతో భారత ఆర్థిక సేవల రంగానికి మరింత బలం చేకూరనుంది.
వ్యవసాయ రంగంలోనూ సహకారం : ఈశాన్య రాష్ట్రాల్లో అధిక విలువ కలిగిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు బీఐజేఎస్ఐ–మేఘాలయ ప్రభుత్వం కలిసి ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేయనున్నాయి.
భారత్–జపాన్ బంధానికి కొత్త ఊపు : ఈ ఒప్పందాల ద్వారా భారత్‌లో హైటెక్ తయారీ, హరిత ఇంధనం, సెమీకండక్టర్లు, ఏఐ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ ఊతం లభించనుంది. అదే సమయంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
